'మనసునమనసై' పాట ఇష్టం లేని వారుండరు కదా. మనసున మల్లెల మాలలూగెనే అని రోజుకోమారన్న పాడుకోకుండా ఉండలేను. నిజంగా అద్భుత సాహిత్య , సంగీతాలు కలిసిన ఆ పాట పాటలను ఎవ్వరమూ మరిచిపోలేము. అందుకే బలవంతంగానైనా మా వాడికి పాత పాటలు వినిపిస్తూంటాను. ప్రేమించు పెళ్ళాడు అనే సినిమాలో ఇళయరాజాగారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. వాటిని ,సిరివెన్నెల పాటలను రోజూ వినాలిసిందే. వాటిని ఏనాడో కొన్న కాసేట్టుల తోనే వినాలి. సిడిల కింకా మార్చలేదు. అవి పెట్టగానే అందరూ తలా ఒక మూలకు వెళ్ళిపోతారు. కానీ నాకవి వింటూ వుంటే పాతికేళ్ళు వెనక్కి వెల్లినట్టనిపిస్తుంది. అప్పుడే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయా అనిపిస్తాయి.
ఇంతకీ ఈ గోడంతా ఎందుకంటే, రేపు పొద్దున్నే ఆ పాటలు పెట్టకు అని గాట్టిగా చెప్పి మరీ పడుకున్నారు, మా పరివారం . అందుకని.
మన మనసులు ఎప్పుడో జరిగిన కొన్ని సంఘటనల దగ్గిరే ఆగి ఎప్పుడూ గుర్తు చేస్తూ వుంటాయి. అందువల్లే, ఈ బిజీ జీవితం నుంచి బయటపడి, నా జ్ఞాపకాలను తలుచుకునేందుకు ఇంత సమయం పట్టింది.
పొద్దున్నే మంచుని చూస్తుంటే సైకిల్లెసుకుని ఆరింటికల్లా ఫిజిక్స్ పాఠాలు చదువుకోవడానికి వెళ్ళడం జ్ఞాపకం వస్తోంది.
ఆయన పేరు 'రాజేశ్వరరావు' గారు. ఎంతో నచ్చేలా చెప్పేవారు. నేర్చుకుని తిరిగి వచ్చేటప్పుడు నేను మా స్నేహితురాలి సైకిల్ తీసుకుని వేగంగా తొక్కడానికి ప్రయత్నం చేస్తూ రోజూ ఒకరికి డాష్ ఇచ్చి కింద పడేసేదాన్ని. ఇదంతా ఇంకా రోడ్ మీదకు రాకుండా కాలేజీ లోనే జరిగేది. దాంతో సర్ కి కంప్లైంట్ ఇవ్వడం, ఆయన నన్ను డైరెక్ట్ గా తిట్టకుండా సైకిల్ ని ఎలా నడపాలో పాఠం ద్వారా చాలా సున్నితంగా చెప్పారు. ఇప్పటికి ఆయన చెప్పిన విధానం బాగా గుర్తుండిపోయింది.
ఆయనో అద్భుతమైన వ్యక్తిత్వం కల మనిషి. ఆయన నుంచే నేను మనిషికి మంచి నడవడిక , మంచి మాట సున్నితత్వం వుంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా గుర్తున్దిపోతారని , ఆయన నేర్పిన దాంట్లో కొంతైనా రోజూ పాటించాలని అనుకుంటూ వుంటాను. నిజం గా జీవితం లో అలాంటి వ్యక్తులవల్లె కొద్దిగానైనా మంచితనం తో బ్రతుకుతున్నాము లేకపొతే, ఎలా వుండేవాల్లమో అనిపిస్తుంది.
