సోమవారం 19 సెప్టెంబర్ 2011

కాస్...ఒక అద్భుత పూదోట.









ఎప్పటినుంచో కాస్ ప్లాటో ని చూడాలని కోరిక. అదీ ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందని విని అందరం కలిసి మొన్న శనివారం నాడు వెళ్ళాము. పూనా నుంచి సుమారు నూట ముఫై కిలోమీటర్ల దూరంలో వుంది. సతార వూరు నుంచి అంతా ఘాట్ రోడ్. అటూ ఇటూ పచ్చటి పచ్చికతో కొండలన్నీ తివాచీలు పరిచినట్టుగా వున్నాయి. ఎంత చూసినా తనివి తీరలేదు. ఆ పచ్చదనంలో కూడా ఎన్నో వర్ణాలు. సుమారు మూడగంతల ప్రయాణం. రోడ్డు మటుకు చాలా బావుంది. సతారా వూరు దాటాక సింగిల్ రోడ్డు . మెల్లిగా చూసుకుంటూ బంనోలి వూరు చేరాము. అక్కడ ఇళ్ళు అక్కడ ఒకటి ఇక్కడ వొకటి కనిపించాయి.
కాస్ ప్లాటో అడవి పుష్పాలకి ప్రసిద్ధి. హిమాలయాలలో ఉన్న "వాలీ ఆఫ్ ఫ్లవర్స్" లా ఇక్కడ కూడా దాదాపు ఐదారు కిలోమీటర్లు పుష్పవనాలతో నిండి వుంటాయి. బంనోలి వూర్లో కనిపిస్తున్న మనిషినల్లా అడుగుతూ కొండపై పైకి చేరాము. దూరం నుంచి అదంతా మేఘాలతో నిండి కొండ కొసలాగా కనిపించింది. ఆ కొండ నిండా మబ్బులు ఆవరించి వున్నాయి. పైకి వెల్లుతున్నకొద్దీ వాతావరణంలో మారు వచ్చింది. మెల్లగా సన్నటి జల్లు పడడం మొదలైంది. పెద్ద వాన కాకూడదు అని మనసులో దణ్ణం పెట్టుకున్నాను. కొండ కొసకి చేరుతూండగా అక్కడ పసుపుపచ్చని పూల వనం కనిపించింది. ఎటు చూసినా పచ్చదనమే. మాకన్నా ముందుగా ఫోటోగ్రాఫర్లు , బయాలజిస్తులు , ఆ పుష్పాల మీద పరిశోధనలు చేసేవాళ్ళు చాలా మంది వున్నారు. నిశ్హబ్డంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మేము వాళ్ళని చూసుకుంటూ అక్కడ దిగకుండా ఇంకా ముందుకి వెళ్ళిపోయాము. దాదాపు కొండ అంచులదాకా వెళ్ళాము. ఈ పసుపు పచ్చని పూలని దాటగానే వాతావరణం తేడాగా మారింది. మొత్తం మంచుతో నిండి దారి ఎ మాత్రం కనబడలేదు. మెల్లగా వెళ్ళడం మొదలుపెట్టాము. కాస్త దూరం వెళ్ళగానే మొత్తం మెజంతా రంగు (క్షమించండి. నాకు ఎ మాత్రం పుష్పాల పేర్లు తెలీవు మరి.) పూలతో నిండిన వనం కనిపించింది.
ఇహ అందరం కిందకు దూకాము. గీతాంజలి సినిమాలో లాగా మంచు పొగతో నిండిపోయింది. చలికి బాగా వణికిపోయాము.
ఆ ప్రకృతి ని చూసి భగవంతుడి సృష్టికి ఎవరైనా ఆశ్చర్య పోవలసిందే. అంత అద్భుతంగా వుంది. ఈ మధ్యనే సందర్శకుల తాకిడి ఎక్కువనదని పర్యావరణ పరిరక్షణ వాళ్ళు అక్కడ కాపలా వాళ్ళను ఏర్పాటు చేసారు. వాళ్ళు బళ్ళను ఆపేసి నడిచి వెళ్లి చూడమన్నారు. (చేతిలో ఇదు వందలు పెట్టిన వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఆపుకోనిచ్చారు అది మనవాళ్ళకు అలవాటే కదా . మేము మాత్రం నడిచి చూస్తేనే బావుంటుందని జాగ్రత్తగా మొక్కలని తొక్కకుండా వెళ్లి చూసాము.
తిరిగి వచ్చేటప్పుడు పసుపుపూల మొక్కల దగ్గర ఆగాము. అదేంటో'వర్షం సినిమాలో లాగా మేము ఎక్కడికి వెళితే అక్కడ వాన పడడమే. మంచులో ఫొటోస్ బాగా తీయలేకపోయాము. ఇక్కడ బాగా తీసాము. ఒక రెండుగంటలు అక్కడ గడిపి తిరిగివస్తూ సతార వూరు నుంచి కొద్ది దూరంలోనే ఉన్న తోసేఘర్ జలపాతాలను చూడడాని వెళ్ళాము. కాస్ ని మటుకు వదలబుద్ధి కాలేదు.
ఈ జలపాతాలకు కూడా ఘాటు రోడ్ గుండా ప్రయాణం చెయ్యాలి. రెప్ప వేయనీయని ప్రకృతి సౌందర్యం. అక్కడ మటుకు బాగా మెట్లు దిగి వెళ్ళాము. కొద్దిగా నడవగానే జలపాతం హోరు వినిపించింది. ఇక చక చకా నడిచాము. అలా చూస్తూ ఉండి పోవాలని అనిపించిది ఆ తెల్లటి నురుగులాంటి జలపాతం దుముకుతూంటే. ఆ రాళ్ళ మీద జాగ్రత్తగా నడిచి మధ్యకు వెళ్ళారు అందరూ. నాకు మటుకు నీళ్ళంటే ఉన్న భయం వల్ల వెళ్ళలేదు. షూట్ చేస్తూ కూర్చున్నాను.
అంతా చూసి ఆనందంతో తిరుగు ప్రయాణం అయ్యాము. అప్పుడు అందరికీ ఆకలి గుర్తుకు వచ్చింది. సతారా లో భోజనం కానిచ్చి అలసిన శరీరాలతో ఆనందం నిండిన మనసులతో పూనా తిరిగి చేరాము.

8 వ్యాఖ్యలు:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

Lovely pics.

తొలకరి చెప్పారు...

థాంక్ యూ

లత చెప్పారు...

చాలా బావుందండి,తప్పకుండా ఒక్కసారి చూడాలనిపిస్తోంది

PRASAD, N.V.V.S చెప్పారు...

మా పాప పేరు "నీహారిక" అంటే మంచుతెర అని మీకు కూడా తెలిసే ఉంటుంది. మీ ఫొటోస్ మా పాపను గుర్తు చేసేలా ఉన్నాయి.

తొలకరి చెప్పారు...

@PRASAD NVVS
థాంక్స్ అండీ. నిజంగా చూడాల్సిన ప్రదేశం.

రాజ్ కుమార్ చెప్పారు...

ఫోటోస్ సూపర్ గా ఉన్నాయండీ.. తప్పకుండా చూడాలి అనిపిస్తుందీ

వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్యొచ్చు కదండీ ;)

PRASAD, N.V.V.S చెప్పారు...

మేము పోయిన దసరాకి నాలుగు రోజులు నవీ ముంబై .. లోనవాలా లో గడిపాము కానీ యీ ప్లేస్ గురించి యెవరూ చెప్పలేదు. మా పొరబాటు కూడా ఉందిలెండి...బోంబే లో మార్కెటింగ్ మీద ఉండే శ్రద్ద మా వాళ్ళకు మిగిలిన విషయాల మీద ఉండదు. ఇంకొకసారి వీలు చూసుకొంటాం.

తొలకరి చెప్పారు...

తప్పకుండా చూడండి. కానీ ఇప్పుడు పూలు పూయడం ఇపోయిందిట. మొన్న తెలిసినవాళ్ళు వెళ్లి చూసి వచ్చారు.