ఆదివారం 27 నవంబర్ 2011

మా కలయిక... ఇరవై సంవత్సరాల తరువాత....

మొన్నా మధ్యన లత  మెయిల్ చేసింది హైదరాబాద్ వస్తున్నాను పదిహేను రోజులు ఉంటున్నాను మనవాళ్ళు ఎవరైనా కలిసారా అని. ఇంతకీ లత ఎవరంటే నా స్నేహితురాలు. నాతోపాటు డిగ్రీ చదివింది. అమెరికా లో సెటిల్ అయ్యింది. ఇండియా వచ్చి ఈ మధ్యన నాలుగేళ్ళు అయ్యింది. మా డిగ్రీ పూర్తి అయ్యి ఇరవై ఏళ్ళు అయ్యాయి. అప్పుడే ఇన్ని ఏళ్ళు గిర్రున తిరిగాయా అనిపిస్తుంది. సరే నేను కుమారిని మటుకే కలుస్తున్నాను, ఇంకెవరూ టచ్ లో లేరు, ప్రయత్నిస్తాను అని చెప్పాను.
ఆరోజు రాత్రి  కూర్చుని నెట్లో వెదకడం మొదలుపెట్టాను. మా వీణ పేస్ బుక్ లో కనిపించింది. పిచ్చ సంతోషం. తన స్కూల్ ఫోటో పెట్టబట్టి గుర్తుపట్టా గలిగాను.తన ద్వారా జయ నెంబరు తెలిసింది. జయ ద్వారా సువర్ణ , కళ్యాణి వివరాలు తెలిసాయి. అలాగే ఇంకో రాత్రి కూర్చుని నా పుస్తక సామ్రాజ్యాన్ని శోదించాను. పద్మ నెంబరు దొరికింది. కానీ ఇప్పుడు వాళ్ళు అక్కడ లేరు. కష్టపడి సెల్ నెంబరు సంపాదించాను. పద్మ ద్వారా వెంకటు, సతీషు ఆచూకీ దొరికింది. నా పుస్తకాల లోనే కవిత నెంబరు అనుకోకుండా భలేగా కనిపించేసింది. ఇంకేముంది.. ఇక అందరం కలవడమే తరువాయి.

ఒక్కొక్కరికి ఫోన్ చేసి మాట్లాడేసరికి తెగ ఆశ్చర్యం ఆనందం. నేను ఈ సారి ఎలాగైనా అందరం లత కోసమైనా కలుద్దామని మిగిలిన వాళ్ళ ఆచూకీ తెలుస్తుందేమో కనుక్కోమని చెప్పాను. మిగిలిన అందరూ వేరే దేశాల లోనే వున్నారు. అందరం నవంబరు ఇదున కలవాలని అనుకున్నాము. ఇక ఆ క్షణం కోసం ఎదురు చూడటమే సరిపోయింది. నేను నాలుగు రోజులముందే మా వాడికి  సెలవలు  ఇవ్వడంతో  హైదరాబాద్ చేరాను. కళ్యాణి వైజాగ్ నుండి వస్తానండి. ఇంకొకరు బెంగళూరు నుంచి. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. నేను ముందుగా లతని పిక్ అప్ చేసుకున్నాను. నన్ను చూడగానే ఏంటే నువ్వు లావు అవ్వదమా అని ఆశ్చర్యపోయింది. ఇంకా సన్న బద్దానులే అని చెప్పాను. ఈ కాస్త తేడాకే నన్ను లావు అయ్యావని అన్నది. ఇంకా నిజంగా అయ్యానా కింద పడిపోతుంది.
ఇద్దరం కలిసి నెక్లస్ రోడ్ లోని ఈట్ స్ట్రీట్ కి బయలు దేరాము. బయట మా బాగులు చెక్ చేస్తున్నారు. లత తెచ్చిన చాకలేట్లను లోపలి తీసుకు వెళ్ల నివ్వమని ఆపేశారు. వాళ్ళతో గొడవ పడుతున్న మాకు వీపు మీద రెండు దెబ్బలు పడ్డాయి. కవిత మీ ఇద్దరి వీపులు పగలకోట్టేసింది. ఇన్ని ఏళ్ళు అయినా తనకీ అలవాటు పోలేదు.

ముగ్గురం కలిసి లోపల కూర్చున్నాము. మాలో పెద్ద మార్పులు  లేవు. పెద్ద వాళ్ళం అయ్యామనే భావన తప్ప. ఈలోగా కవిత అదిగో సువర్ణ వచ్చింది అన్నది. నేను అస్సలు గుర్తుపట్ట లేదు దగ్గరగా వచ్చాక కానీ. తన ఆరేళ్ళ చిన్న కూతురిని తీసుకుని వచ్చింది. పెద్ద అమ్మాయి తరువాత లేటుగా పుట్టిందని సిగ్గుపడింది. చాలా మారిపోయింది. కుమారి ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే పెద్ద టెన్షను లో వున్నాను వస్తానో లేదో అన్నది. నాకు అస్సలు బాగా అనిపించలా. ఎలాగైనా రావలిసిందే అని చెప్పాను. ఈలోగా వీణ, వెంటనే కల్యాణి వచ్చారు. ఇద్దరూ ఒకటే గోల. మా కల్యాణి అప్పటిలాగే శ్రధగా అలంకరించుకుని వచ్చింది. వీణా గల గలా అలాగే మాట్లాడుతోంది. ఇక కవిత, లత, సువర్ణ కబుర్లు ఆగడం లేదు. నేను మటుకు అందరినీ ఆనందం గా చూస్తూ ఫొటోస్ తీసుకుంటున్నాను. అందరూ ఒక్క సారిగా అరిచారు. జయ వచ్చింది. తనూ చాలా మారిపోయింది. చాలా నిదానంగా వుండేది. పిచ్చ పోష్ గా వచ్చింది. అందరూ కెవ్వు కెవ్వున కేకలే. ఈలోగా పద్మ, వెంకట్ చేరారు. కుమారి వస్తున్నాను అని మెసేజ్ పంపించింది.
కాసేపటికి కుమారి కూడా వచ్చింది. అందరం ఏదో డిగ్రీ లో సెలవలు అయ్యి కలిసినట్టుగా ఉన్నాము కానీ మేము కలిసి ఇరయై ఏళ్ళు అయినట్టు అనిపించలేదు.
అందరికీ సొంత వ్యక్తిత్వాలు ఏర్పడ్డాయి, అభిప్రాయాలు అభిరుచులూ మారివుంటాయి. జీవితం లోని సుఖదుఖాలని చూసి వుంటారు. కానీ స్నేహం ఎంత అద్భుతమైనది. స్నేహితుల మధ్యన మాటలు ఆ చనువు అలాగే ఇన్ని సంవత్సరాల తరువాత కూడా మారలేదు. అలాగే నాలుగు గంటలు గడిచిపోయాయి. ఇంకా తనివితీరా మాట్లాడుకోవాలని వుంది. కాని వెళ్ళక తప్పదు.
ఒకరి కష్ట సుఖాలు ఒకరం చెప్పుకున్నాము. సువర్ణ  తన ఇబ్బందుల గురించి అనగానే కల్యాణి తన చెల్లెలి ద్వారా తనకో మార్గం చూపింది. మాకందరికీ సంతోషం అనిపించింది. తనకు మేమున్నాము అనే భరోసా ఇచ్చాము. సతీషు, శ్రీనివాస్ ఫోనులో మాట్లాడారు. మిస్ అయ్యినందుకు ఫీల్ అయ్యారు. అందరం మాట్లాడాము.
ఇంతకీ నాకో క్రెడిటు దక్కింది. అందరూ నా వల్లనే కలిసామని నాకు ఇంకా అభినందనలు చెపుతూనే వున్నారు. నేను చాలా సార్లు ప్రయత్నించి విసిగి పోయాను. ఏమో మరి మేము అందరం ఇలా ఇరవై ఏళ్ళు గడిచిన   తరువాత కలవాలని రాసి పెట్టినట్టు వున్నది.

అందరం సంతోషం నిండిన మనసుతో, వెళ్ళక తప్పదన్న బాధతో  ఇక మీదట కనీసం ఏడాదికి వొకసారి అయినా కలవాలని నిశ్చయించు కున్నాము. ఒక్కొక్కరమూ వీడ్కోలు తీసుకున్నాము. ఇదిగో అందరికీ ఫోన్లు చేస్తూ ఫొటోస్ ని అప్లోడ్ చేస్తూ ఇలా ఈరోజు కి కూర్చుని నా జ్ఞాపకాలని నెమరు వేసుకునే తీరుబడి చిక్కింది.

శనివారం 15 అక్టోబర్ 2011

మనసు...ఆంక్షలు....

మనసు మనసు అంటాం కానీ ఇంతకీ మనసంటే ఏంటి. బుద్ధి వద్దని చెబుతున్నా వినకుండా గంతులేసేదే మనసేమో.
వూహ తెలిసినప్పటినుంచీ ఈ మనసుగోల మొదలుతుంది. వానలో ఆడాలని మనసుపడతాం, కానీ ఆంక్షలు. స్నేహితులతో గంటలతరబడి కబుర్లు చెప్పాలని మనసు పడతాం, కానీ చదివే సమయం తగ్గుతుందని ఆంక్షలు.
చిన్నతనంలో ఇవన్నీ మామూలే. కానీ పెద్ద అయ్యాక కూడా ఈ ఆంక్షలు మనకు తప్పవు అనే పరిస్థితి ఏర్పడుతోంది.
పెళ్లి అవ్వగానే భాగస్వామి ఆంక్షలు, ఆడవారికైనా సరే, మగవారికైనా సరే. పిల్లలు పుట్టగానే వారికోసం మన మనసుకు విధించుకునే ఆంక్షలు. ఇహ మెల్లిగా మనకు మనసు ఉన్నదీ అన్న సంగతే మర్చిపోతాము. మన భాద్యత, మన కర్తవ్యమ్ అనుకుంటూ సర్ది చెప్పేసుకుని జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉంటాము.

ఎప్పుడో ఉన్నట్టుండి గట్టిగా కేకలేస్తూ ఆ మనసు మనలోనే ఇంకా ఉన్నానంటూ గోల చేస్తుంది.
అది ఎ సందర్భము అయినా కావచ్చు దాని లెఖ వుండదు. ఇంతకాలం నుంచి నన్ను అనగదొక్కేసావా అంటూ అల్లరి చేస్తుంది. కాకపొతే జీవితం యాంత్రికంగా మారిన తరువాత అప్పుడప్పుడూ నేను ఇంకా నీలోనే వున్నాని గుర్తు చేసే ఈ మనసు ఎంతో సున్నితం.
అది స్పందించడానికి ఒక గొప్ప సందర్భమే అఖరలేదు. ఉన్నట్టుండి పావురాలన్నీ ఎగుర్తూ వుంటే ఉలిక్కిపడి వెనక్కి జరిగి చప్పట్లు కొట్టే చిన్నారిని చూడగానే మనసు ఎంత ఆనందపడుతుందని.
వానలో తడిసిన చిన్నారి అమ్మ ఎక్కడ కొడుతుందో అనుకుంటూ ఇంటికి వస్తే ఏమీ అనకుండా నవ్వేసి దగ్గర చేర్చుకుంటే ఆ కళ్ళలోన్ని ఆనందాన్ని ఆస్వాదించకుండా ఈ మనసు ఊరుకుంటుందా?
ఎందుకో ఇవాళ చిన్ని చిన్ని సంఘటనలే నా మనసుకు సంతోషానిచ్చాయి. ఇంకా ఎంతో రాయాలని వున్నా నాకు నేను పెట్టుకున్న ఆంక్షల వల్ల మనసుకి గుడ్ బై చెప్పక తప్పడం లేదు.

సోమవారం 19 సెప్టెంబర్ 2011

కాస్...ఒక అద్భుత పూదోట.









ఎప్పటినుంచో కాస్ ప్లాటో ని చూడాలని కోరిక. అదీ ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందని విని అందరం కలిసి మొన్న శనివారం నాడు వెళ్ళాము. పూనా నుంచి సుమారు నూట ముఫై కిలోమీటర్ల దూరంలో వుంది. సతార వూరు నుంచి అంతా ఘాట్ రోడ్. అటూ ఇటూ పచ్చటి పచ్చికతో కొండలన్నీ తివాచీలు పరిచినట్టుగా వున్నాయి. ఎంత చూసినా తనివి తీరలేదు. ఆ పచ్చదనంలో కూడా ఎన్నో వర్ణాలు. సుమారు మూడగంతల ప్రయాణం. రోడ్డు మటుకు చాలా బావుంది. సతారా వూరు దాటాక సింగిల్ రోడ్డు . మెల్లిగా చూసుకుంటూ బంనోలి వూరు చేరాము. అక్కడ ఇళ్ళు అక్కడ ఒకటి ఇక్కడ వొకటి కనిపించాయి.
కాస్ ప్లాటో అడవి పుష్పాలకి ప్రసిద్ధి. హిమాలయాలలో ఉన్న "వాలీ ఆఫ్ ఫ్లవర్స్" లా ఇక్కడ కూడా దాదాపు ఐదారు కిలోమీటర్లు పుష్పవనాలతో నిండి వుంటాయి. బంనోలి వూర్లో కనిపిస్తున్న మనిషినల్లా అడుగుతూ కొండపై పైకి చేరాము. దూరం నుంచి అదంతా మేఘాలతో నిండి కొండ కొసలాగా కనిపించింది. ఆ కొండ నిండా మబ్బులు ఆవరించి వున్నాయి. పైకి వెల్లుతున్నకొద్దీ వాతావరణంలో మారు వచ్చింది. మెల్లగా సన్నటి జల్లు పడడం మొదలైంది. పెద్ద వాన కాకూడదు అని మనసులో దణ్ణం పెట్టుకున్నాను. కొండ కొసకి చేరుతూండగా అక్కడ పసుపుపచ్చని పూల వనం కనిపించింది. ఎటు చూసినా పచ్చదనమే. మాకన్నా ముందుగా ఫోటోగ్రాఫర్లు , బయాలజిస్తులు , ఆ పుష్పాల మీద పరిశోధనలు చేసేవాళ్ళు చాలా మంది వున్నారు. నిశ్హబ్డంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మేము వాళ్ళని చూసుకుంటూ అక్కడ దిగకుండా ఇంకా ముందుకి వెళ్ళిపోయాము. దాదాపు కొండ అంచులదాకా వెళ్ళాము. ఈ పసుపు పచ్చని పూలని దాటగానే వాతావరణం తేడాగా మారింది. మొత్తం మంచుతో నిండి దారి ఎ మాత్రం కనబడలేదు. మెల్లగా వెళ్ళడం మొదలుపెట్టాము. కాస్త దూరం వెళ్ళగానే మొత్తం మెజంతా రంగు (క్షమించండి. నాకు ఎ మాత్రం పుష్పాల పేర్లు తెలీవు మరి.) పూలతో నిండిన వనం కనిపించింది.
ఇహ అందరం కిందకు దూకాము. గీతాంజలి సినిమాలో లాగా మంచు పొగతో నిండిపోయింది. చలికి బాగా వణికిపోయాము.
ఆ ప్రకృతి ని చూసి భగవంతుడి సృష్టికి ఎవరైనా ఆశ్చర్య పోవలసిందే. అంత అద్భుతంగా వుంది. ఈ మధ్యనే సందర్శకుల తాకిడి ఎక్కువనదని పర్యావరణ పరిరక్షణ వాళ్ళు అక్కడ కాపలా వాళ్ళను ఏర్పాటు చేసారు. వాళ్ళు బళ్ళను ఆపేసి నడిచి వెళ్లి చూడమన్నారు. (చేతిలో ఇదు వందలు పెట్టిన వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఆపుకోనిచ్చారు అది మనవాళ్ళకు అలవాటే కదా . మేము మాత్రం నడిచి చూస్తేనే బావుంటుందని జాగ్రత్తగా మొక్కలని తొక్కకుండా వెళ్లి చూసాము.
తిరిగి వచ్చేటప్పుడు పసుపుపూల మొక్కల దగ్గర ఆగాము. అదేంటో'వర్షం సినిమాలో లాగా మేము ఎక్కడికి వెళితే అక్కడ వాన పడడమే. మంచులో ఫొటోస్ బాగా తీయలేకపోయాము. ఇక్కడ బాగా తీసాము. ఒక రెండుగంటలు అక్కడ గడిపి తిరిగివస్తూ సతార వూరు నుంచి కొద్ది దూరంలోనే ఉన్న తోసేఘర్ జలపాతాలను చూడడాని వెళ్ళాము. కాస్ ని మటుకు వదలబుద్ధి కాలేదు.
ఈ జలపాతాలకు కూడా ఘాటు రోడ్ గుండా ప్రయాణం చెయ్యాలి. రెప్ప వేయనీయని ప్రకృతి సౌందర్యం. అక్కడ మటుకు బాగా మెట్లు దిగి వెళ్ళాము. కొద్దిగా నడవగానే జలపాతం హోరు వినిపించింది. ఇక చక చకా నడిచాము. అలా చూస్తూ ఉండి పోవాలని అనిపించిది ఆ తెల్లటి నురుగులాంటి జలపాతం దుముకుతూంటే. ఆ రాళ్ళ మీద జాగ్రత్తగా నడిచి మధ్యకు వెళ్ళారు అందరూ. నాకు మటుకు నీళ్ళంటే ఉన్న భయం వల్ల వెళ్ళలేదు. షూట్ చేస్తూ కూర్చున్నాను.
అంతా చూసి ఆనందంతో తిరుగు ప్రయాణం అయ్యాము. అప్పుడు అందరికీ ఆకలి గుర్తుకు వచ్చింది. సతారా లో భోజనం కానిచ్చి అలసిన శరీరాలతో ఆనందం నిండిన మనసులతో పూనా తిరిగి చేరాము.

శుక్రవారం 26 ఆగస్టు 2011

వర్షపు చినుకుల్లో మా సైకిల్ యాత్ర

ఇవాళ వాతావరణం చాలా ఆహ్లాదంగా వుంది. చిన్న చిన్న ఆనందాలని మిస్ చేసుకోకూడదనిపించింది. వెంటనే మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి మరీ బుర్ర తిన్నాను. ఇంటరు ఇద్దరం ఒకే కాలేజీలో చదివేవాళ్ళం. తను నాకన్నా ఒక ఏడాది సీనియర్. చిన్నప్పటి నుంచి స్నేహితులం. సన్నగా జల్లు పడుతూంటే ఇద్దరం సైకిల్ ఎక్కి నాలుగు మైళ్ల దూరాన వున్నా సముద్రం రోడ్ వైపు వెళ్ళేవాళ్ళం. అటూ ఇటూ పచ్చటి పొలాలు. మధ్యన ఆగి వాటిని చేతులతో తాకి సినిమాల్లో లాగా పరిగెత్తి నవ్వుకునేవాళ్ళం. మళ్ళీ సైకిల్ ఎక్కి బ్రిడ్జీ దాక వెళ్లి అక్కడ కిందకు దిగి ఆగివున్న పడవలో ఎక్కి కూర్చుని, వెంట తెచ్చుకున్న మొక్కజొన్న కండలను తిని ప్రేమించు పెళ్ళాడు సినిమా లోని 'వయ్యారి గోదారమ్మ' పాటని బాగా పెద్దగా పాడుకుని ఆనందించేవాళ్ళం. బ్యాక్ గ్రౌండ్ సోలో ని కూడా మేమే పాడేసుకునేవాళ్ళం. ఈలోపల వాన పెద్దది అవుతుందని సముద్రం దాకా వెళ్ళకుండా ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళం. ఒక్కనాడూ ఇద్దరం సైకిల్ మీద సముద్రానికి వెళ్ళనే లేదు.
ఇవన్నీ దానికి వర్ణించి మరీ గుర్తు చేసాను. అసలే గొంతు నెప్పితో బాధపడుతోంది. ఇంకేమి అనలేక నా సోదంతా విని గుంటూరు ఎప్పుడు వస్తావు బాపట్ల వెళదాము అన్నది. నువ్వు సైకిల్ మీద ఎక్కించుకుని తోక్కుతానంటే వస్తానని అన్నాను సరదాగా. మా అయన నాకు విడాకులు ఇస్తారేమో అన్నది. పర్లేదు, వదిలి అన్నా. అంతే, నాకు ఇవాళ తిక్క బాగా వచ్చిందని రేపు మాట్లాడదాం ఆఫీసు లో నీకు పని ఎక్కువైనట్టు వున్నదని పెట్టేసింది.
నాకేమో మళ్ళీ మళ్ళీ అవే సంగతులు గుర్తుకొస్తున్నాయి. మాట్లాడదామంటే మా వాడు నిద్ర పోయాడు. ఆయన వూరికి వెళ్ళారు. ఇలా బ్లాగు మీద పడ్డాను.
ఇనాటి చినుకులకీ ఆనాటి చినుకులకీ ఎంత తేడా?

గురువారం 4 ఆగస్టు 2011

వి.ఆనంద్ మా అబ్బాయి స్కూల్ లో....




మొన్న సాయంత్రం విశ్వనాథన్ ఆనంద్ పూనా వచ్చారు. ఆయన మా మా అబ్బాయి చదువుతున్న పవార్ పబ్లిక్ స్కూల్ లో జి.ఎం.ఎస్. ఎఫ్. గోల్డెన్ చెస్ టోర్నమెంట్ ని మా వాడి స్కూల్ లో ప్రారంభించారు. సాయంత్రం ఆరింటికల్లా వెళ్లి కూర్చున్నాము. ఏడింటికి విశ్వనాథన్ ఆనంద్ వచ్చారు. మా వాడికి ఒకటే సంతోషం. ఎలాగైనా ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవాలని. ముందుగా పూనా లో కెల్లా ప్రసిద్ధి చెందిన గుండె వైద్య నిపుణులు చాలా సరదాగా సమావేశాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని, పోటీలను నిర్వహిస్తున్న పి.యన్.గాడ్గిల్ కంపనీ అధినేత కూడా వేదిక మీదకు వచ్చాక విశ్వనాథన్ ఆనంద్ ని ఆహ్వానించారు. ఇద్దరూ ఆయన్ని వాళ్ళతో బాటు కూర్చో బెట్టి ఆయన్ని అనేక ప్రశ్నలు అడిగారు. ఆయన చిన్నతనం నుంచి , పోటీల గురించి చాలా విషయాలు అడిగారు. అన్నిటికీ ఓర్పుగా సమాధానాలు చెప్పారు.

చివరగా పిల్లలు కూడా కొన్ని ప్రశ్నలు వేసారు. ఆయన ఆడటానికి రెండు గంటల ముందు నుంచీ ఏమీ తినరట.పిల్లలు చదరంగం ఆడడానికి పూర్తిగా టెక్నాలజీ పైనే ఆధారపడకుండా బోర్డు మీద అభ్యాసన చేయడమే మంచిదన్నారు. ఆయన చిన్నతనం లో కన్నా ippati pillalaku ekkuva vishayaalanu telusukune అవకాశం వున్నదని, దాన్ని పెద్ద వాళ్ళు సరైన విధంగా వాడుకునేట్టు చెయ్యాలని సూచించారు.
ఇంకో ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆయనకు కూడా మతిమరుపు ఉన్నదట. ప్రతిసారి, ఉంగరాలను పోగొట్టుకున్తానని చెప్పారు. ఇంకా గడియారాలను కూడా పోగొట్టుకున్నారట.
అంత ఎత్తుకి ఎదిగినా ఎంతో వొద్దికగా సమాధానాలు చెప్పారు. చివరలో బంగారు వెండి చెస్ బోర్డు ని వేలం పాట వేసారు. అంతా అయ్యిన్దాక ఉండి పిల్లలందరికీ ఆటోగ్రాఫులు ఇచ్చి వెళ్ళారు.
ఆయన్ని చూడడం నాకూ చాల సంతోషానిచ్చింది. విలువైన విషయాలెన్నో చెప్పారు.
నా జీవితంలో గుర్తుంచుకోదగ్గ రోజు.